: డ్రగ్స్ కేసులో మరో సంచలనం... విజయవాడ యువతి అరెస్ట్
డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులు, తమకు అందిన సాక్ష్యాలతో గత రాత్రి నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి, ముగ్గురు నైజీరియన్ సభ్యుల ముఠాతో పాటు, ఓ విజయవాడ యువతిని కూడా అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ అధికారులు జరిపిన ఈ దాడి తరువాత, వారి నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 700 ఎల్ఎస్డీ డ్రగ్ స్ట్రిప్స్, రూ. 2.5 లక్షల నగదు పట్టుబడినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. నగరంలోని నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అరెస్టయిన వారిలో ఉండటం గమనార్హం. అతనికి, విజయవాడ యువతికి ఉన్న సంబంధమేంటో ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.