: ఇది 'కాశ్మీర్ వత్సరం' కొత్త ప్రచారం మొదలుపెట్టిన లష్కరే... తన వంతు సహకారమిస్తున్న పాక్ సైన్యం
వాస్తవాధీన రేఖ వెంబడి జూలైలో పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన తుపాకీ తూటాలకు 9 మంది జవాన్లు సహా 11 మంది చనిపోగా, 16 మంది గాయపడ్డారు. వేలాది మందిని సరిహద్దు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. గతంతో పోలిస్తే, జూలైలో పాక్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దాదాపు అన్ని రోజులూ ఎక్కడో ఒకచోట కాల్పులు జరుపుతూనే ఉంది. దీనికి కారణం, కాశ్మీర్ ను పూర్తి అధీనంలోకి తెచ్చుకోవాలన్న పాక్ కుట్రను లక్ష్యానికి దగ్గర చేసేందుకు లష్కరే తోయిబాగా పిలవబడే పాక్ కేంద్రంగా నడుస్తున్న జమాత్ ఉద్ దవా, కాశ్మీర్ లోయలో 'ఇయర్ ఆఫ్ కాశ్మీర్' పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సంవత్సరమంతా కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం కోసం పోరాడుతామని చెబుతూ, భారత సైనిక దళాలను టార్గెట్ చేసుకుంటూ భారీ దాడులకు ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం తన పేరును టీఏజేకే (తెహరీక్ ఆజాదీ జమ్మూ అండ్ కాశ్మీర్) గా మార్చుకున్న లష్కరే, 2017 సంవత్సరాన్ని కాశ్మీర్ వత్సరంగా ప్రకటించడం వెనుక పాక్ కుట్రలు ఉన్నాయని సైనికాధికారి ఒకరు తెలిపారు. కాశ్మీర్ వివాదాన్ని మరింతగా చర్చలోకి తెచ్చేలా సరిహద్దుల్లో నిత్యమూ కాల్పులకు పాల్పడటం ఇందులో ఓ భాగమని ఆయన అన్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో 35 ప్రాంతాల్లో 110 సార్లు పాక్ కాల్పులకు దిగిందని, ఒక్క రాజౌరీ జిల్లాలోనే పదుల సంఖ్యలో సామాన్యుల ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు అంటున్నారు. సరిహద్దుల నుంచి ముష్కరుల చొరబాటుకు సహకరించాలన్న ఉద్దేశంతో, సైనికుల దృష్టిని మరల్చేందుకు ఒక్కోసారి భారీ ఎత్తున కాల్పులకు దిగుతోందని అన్నారు.