: అమెరికా చేతులు ముడుచుకుని కూర్చోవడం మంచిది కాదు: యూఎస్ సీనియర్ సైన్యాధికారి
ఉత్తరకొరియాతో యుద్ధానికి సిద్ధం కావాలని యుద్ధానికి అమెరికా సీనియర్ సైనికాధికారి జోసెఫ్ డ్యుఫోర్డ్ పిలుపు నిచ్చారు. ఉత్తరకొరియా చేష్టలు హద్దుమీరాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని చిన్న రాష్ట్రమైన హవాయి పరిమాణంలో వుండే ఉత్తర కొరియా న్యూక్లియర్ పరీక్షలు చేస్తుంటే అమెరికా చేతులు ముడుచుకుని కూర్చోవడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇలా ఉండడం వల్ల ఉత్తరకొరియాకు అమెరికా భయపడిందనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అధ్యక్షుడు ట్రంప్ దీనిపై తక్షణం స్పందించాలని ఆయన సూచించారు. ట్రంప్ నుంచి ఆదేశాలు రాక ఆలోచిస్తున్నామని, ఆదేశాలు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్ నరరూప రాక్షసుడని ఆయన పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా వెళ్లేవారంతా తనకు మోకరిల్లాలంటూ నిబంధనలు విధించాడని ఆయన మండిపడ్డారు. అమెరికన్లను ఆ దేశం వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఉత్తరకొరియాపై ఇప్పటికైనా యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉతరకొరియాపై యుద్ధం చేస్తే, ఆ దేశ ప్రజలు కూడా సంతోషిస్తారని, వారికి స్వేచ్చావాయువులు అందుతాయని ఆయన పేర్కొన్నారు.