: ఎన్ని సార్లు మమ్మల్ని క్షోభ పెడతారు?: మీడియాను ప్రశ్నించిన తరుణ్
డ్రగ్స్ కేసులో ప్రాథమిక విచారణ అనంతరం టాలీవుడ్ నటుడు తరుణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. మొదటి నుంచీ మీడియా తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని, ఈ మధ్య కాలంలో మాత్రం తనపై కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తానేదో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని, తన తల్లి స్నేహితురాలి కుమార్తెతో తన వివాహం కుదిరిపోయిందని, తాను నెలలో 15 రోజులు గోవాలో ఉంటానని, తనకు బినామీ పేర్లతో పబ్ లలో వాటాలు ఉన్నాయని... ఇలా రకరకాల ప్రచారాలు తనపై జరిగాయని అన్నాడు.
ఇలాంటి పుకార్లు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఎవరైనా, ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించాడు. మీడియాలో వచ్చే రోజుకొక వార్తతో తన కుటుంబం చాలా క్షోభపడుతోందని, దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపాలని కోరాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పాడు. చట్టంపైన, అకున్ సబర్వాల్ పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని, తానేతప్పు చేయలేదని స్పష్టం చేశాడు. తానేనాడు చట్టపరిధిని దాటి వ్యవహరించలేదని అన్నాడు. డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పిన తరుణ్... ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని సూచించాడు.