: పది సెకన్ల వీడియో చూసి తప్పుడు ప్రచారం చేశారు... రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెప్పా: తాప్సి
ఇటీవల ఓ కార్యక్రమంలో తన తొలి చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ, ఎందరో హీరోయిన్లపై పూలు, పండ్లు విసిరిన ఆయన, తన బొడ్డుపై కొబ్బరి చిప్పలు విసిరేశారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తాప్సి తన వివరణ చెప్పుకొచ్చింది. ఆ కార్యక్రమం పావు గంట పాటు సాగిందని, మిగతా భాగాన్ని వదిలేసి, కేవలం 10 సెకన్ల బిట్ ను పదే పదే చూపి తనపై తప్పుడు ప్రచారాన్ని చేశారని ఆరోపించింది.
ఓ గ్లామర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు తాను తెలుసునని, బాలీవుడ్ కు మాత్రం షబానా అజ్మీ వంటి నటిగా పరిచయం అయ్యానని చెప్పుకున్న తాప్సీ, మొత్తం వీడియోను చూడకుండా, తానన్న మాటలు వినకుండా రాద్ధాంతం చేశారని తెలిపింది. ఈ విషయంలో రాఘవేంద్రరావు బాధపడ్డారని తనకు తెలిసి, ఆయనకు క్షమాపణలు చెప్పానని, అసలు విషయాన్ని చెబుతూ తాను స్వయంగా మాట్లాడానని, ఆయన కూడా తనను ఆశీర్వదించారని అంది. తనకు తెలుగు సినిమాలన్నా, తెలుగువారన్నా ఎంతో ఇష్టమని చెప్పింది.