: పాఠశాల మరుగుదొడ్డిలో మృత శిశువును కన్న పదో తరగతి బాలిక
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై, ఇంటి పక్కనే ఉండే 51 ఏళ్ల వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయగా, గర్భం దాల్చిన బాలిక, స్కూలు మరుగుదొడ్డిలో మృత శిశువును ప్రసవించింది. ముఖర్జీ నగర్ లో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలికకు డబ్బు ఆశ చూపిన ఆ ప్రబుద్ధుడు లొంగదీసుకున్నాడు.
బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. అది విఫలం కాగా, పాఠశాలకు పరీక్షల నిమిత్తం వచ్చిన బాలిక, తీవ్రమైన కడుపునొప్పితో బాత్ రూముకు వెళ్లి, అక్కడే ప్రసవించింది. తమ కుమార్తె గర్భవతన్న సంగతి బాధితురాలి తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్భయ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.