: ప్రతి జిల్లాకూ వస్తా... ప్రతి ఒక్కరినీ కలుస్తా: వైఎస్ జగన్
తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాలకూ వస్తానని, ప్రజలందరినీ కలుస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 27న ఇడుపులపాయలో మహానేత స్మృతి చిహ్నం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి తిరుమల మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ 3 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని జగన్ వెల్లడించారు. తాను కాలినడకనే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లనున్నట్టు తెలిపిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు కృత నిశ్చయంతో ఉన్నానని తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటించాలన్నదే తన లక్ష్యమని, అయితే, సమయాభావం, ప్రయాణించే మార్గాల్లో సమస్యల కారణంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను తాకలేకపోవచ్చని ఆయన అన్నారు.