: కలకలం రేపుతున్న తన వ్యాఖ్యలపై మరో వివరణ ఇచ్చిన రాంగోపాల్ వర్మ
టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న వేళ, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివరణ ఇచ్చాడు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ అకున్ సబర్వాల్ నిజాయతీపై తనతో సహా ఎవరికీ అనుమానాలు లేవని అన్నాడు. అయితే, మీడియాకు లీకులిస్తున్న అంశాన్ని మాత్రమే తాను ప్రశ్నించానని, నటుల ఇమేజ్ ను దెబ్బతీసే ఈ తరహా చర్యలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని అడిగానని ఆయన తెలిపాడు.
సినీ ప్రముఖులకు మాత్రమే నోటీసులు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, డ్రగ్స్ దందాలో పేరున్న రాజకీయ నేతలు, వీఐపీలు లేదా మరెవరైనా, అన్ని వర్గాలనూ కలిపి నోటీసులు ఇచ్చి విచారించి వుంటే, ఈ తరహా విమర్శలు వచ్చుండేవి కాదని అభిప్రాయపడ్డాడు. కేసులో ఎంతో మంది పేర్లు లీకవుతున్నాయని, అయితే, సినిమా వాళ్లే తప్పు చేస్తున్నారన్న సంకేతాలు ఇస్తూ, మిగతా అన్ని వర్గాల వారినీ ఎందుకు వదిలేస్తున్నారన్నదే తన ప్రశ్నని చెప్పుకొచ్చాడు.