: నోట్7 ఫోన్ల నుంచి టన్నుల కొద్దీ బంగారం తీస్తున్న శాంసంగ్
గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చి, బ్యాటరీలో లోపాల కారణంగా పేలిపోతున్నాయన్న ఫిర్యాదు వచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను వెనక్కు తీసుకున్న సంస్థ, ఇప్పుడు వాటి నుంచి టన్నుల కొద్దీ బంగారం సహా విలువైన లోహాలను బయటకు తీయనుంది. కొన్ని లక్షల ఫోన్లను వెనక్కు తీసుకున్న సంస్థ, ఎవరికీ విక్రయించకుండా మిగిలిపోయిన ఫోన్లలో మాత్రం సరికొత్త 3,200 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చి నోట్ ఎఫ్ఈ పేరిట విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఒకసారి విక్రయించి వెనక్కు తెచ్చిన ఫోన్లను రీసైకిలింగ్ చేయడం ద్వారా 157 టన్నుల మేరకు బంగారం, వెండి, కోబాల్ట్, రాగి తదితర లోహాలను సేకరించనున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ నెలాఖరు నుంచి రీసైకిలింగ్ పనులు మొదలవుతాయని తెలిపింది. ఫోన్ లోని డిస్ ప్లే, సెమీ కండక్టర్లు, కెమెరా మాడ్యూల్స్ వేరు చేస్తామని, పర్యావరణానికి హాని కలగని రీతిలో ఈ పనులు జరుగుతాయని వెల్లడించింది. కొన్ని భాగాలను మాత్రం నోట్ ఎఫ్ఈకి అవసరమయ్యే విడిభాగాలుగా వాడుకుంటామని పేర్కొంది.