: శిరీషపై చెయ్యేశాడు, ఆ భయంతోనే తుపాకితో కాల్చుకుని చనిపోయాడు: డీజీపీకి చేరిన ఎస్ఐ ఆత్మహత్య నివేదిక
గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో తుది నివేదికను అదనపు డీజీపీ గోపీకృష్ణ, డీజీపీ అనురాగ్ శర్మకు అందించారు. ప్రభాకర్ రెడ్డి, శిరీషపై చెయ్యేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని, లొంగదీసుకునేందుకు యత్నించి విఫలమయ్యాడని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసి, తన కారణంగానే ఆమె మరణించిందన్న మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని తన నివేదికలో తెలిపాడు.
గత నెల 14వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ కు ఫోన్ చేసిన ప్రభాకర్ రెడ్డి, శిరీష ఆత్మహత్యను ప్రస్తావించాడని, ఆపై 11 గంటలలోపే తన క్వార్టర్స్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మరణించాడని తెలిపారు. గజ్వేల్ ఏసీపీ గిరిధర్, ప్రభాకర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధించాడని వచ్చిన ఆరోపణలూ వాస్తమేనని నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో పలువురిపై ఇప్పటికే శాఖా పరమైన చర్యలు తీసుకున్నామని, మరికొందరిపై చర్యలుంటాయని వెల్లడించారు.