: కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే... పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్?
పనామా లీక్స్ కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు దోషిగా నిర్ణయించిన నేపథ్యంలో ఆయన తమ్ముడు, ప్రస్తుతం పాక్ లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ షరీఫ్ తరువాతి ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన పార్లమెంట్ కు ఎంపికయ్యే వరకూ నవాజ్ కు మిత్రుడిగా, సన్నిహితుడిగా ఉండే రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికార పీఎంఎల్ఎన్ నాయకుడు ఒకరు మీడియాకు తెలిపారు.
కాగా, దోషిగా నిర్దారణ అయి, పదవిని కోల్పోవాల్సి వస్తే, నవాజ్ సోదరుడు షహబాజ్ తో పాటు ఆయన భార్య కల్సూమ్ లలో ఎవరో ఒకరు జాతీయ అసెంబ్లీకి ఎన్నికై, ప్రధానిగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో షరీఫ్ తన లాయర్లతో సమావేశమై, పరిస్థితులను సమీక్షించారు.