: రైల్వే మంత్రికి మేనల్లుడి పోటు!
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ కు మేనల్లుడి లంచం వ్యవహారం తలనొప్పులు సృష్టిస్తోంది. బన్సల్ మేనల్లుడు వి.సింగ్లా ఓ అధికారికి రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తామంటూ అతని వద్దనుంచి 90 లక్షలు లంచం స్వీకరించారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి చండీగఢ్ లో సింగ్లాతో పాటు మరో ముగ్గురిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ లంచం వ్యవహారంలో బన్సల్ కూ ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపించింది. దీంతో మనస్తాపం చెందిన బన్సల్.. నేడు ప్రధానిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్టు సమాచారం.
నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తన మేనల్లుడితో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని బన్సల్ చెప్పారు. అయితే, మంత్రిగారి మేనల్లుడు అధికారి నుంచి లంచం స్వీకరించడంపై బీజేపీ మండిపడింది. నైతిక బాధ్యత వహిస్తూ.. ప్రధాని మన్మోహన్, రైల్వే మంత్రి బన్సల్ ఇద్దరూ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడిన ఎవరైనా విచారణకు సిద్ధపడాల్సిందే అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.