: మోదీని ఓడించాలని మమతా బెనర్జీ పగటి కలలు కంటున్నారు!: కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై మండిపడుతూ ‘బీజేపీ క్విట్ ఇండియా’ ఉద్యమం చేపడతానని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ మండిపడ్డారు. మోదీని ఓడించాలని మమతా బెనర్జీ పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. మమతా బెనర్జీ మాత్రమే కాకుండా విపక్ష నేతలు అందరూ ఇదే కల కంటున్నారని చురకలంటించారు. భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోందని అన్నారు.
నిన్న మమతా బెనర్జీ నిరాశ, నిస్పృహలతో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడమే ఆమె లక్ష్యం అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ఎంతగా ప్రయత్నించినా ప్రజలు తమవైపే ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీకి బలం పెరుగుతుండడంతో మమతా బెనర్జీ భయపడిపోతున్నారని ఆయన అన్నారు.