: కోహ్లీ బాటలోనే శుక్లా.. పప్పులో కాలేశాడు!
మహిళల ప్రపంచ కప్ లో మన అమ్మాయిలు దుమ్ము రేపుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను చిత్తు చేసి, ఫైనల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఐపీఎల్ ఛైర్మన్, ఎంపీ రాజీవ్ శుక్లా చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. 'ఛాంపియన్స్' ట్రోఫీలో ఆసీస్ పై గెలిచి ఫైనల్స్ కు చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో దుమారం రేగింది. శుక్లాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అసలు ఏ టోర్నీ జరుగుతోందో నీకు తెలుసా? అంటూ మండిపడ్డారు. ట్వీట్ చేసేముందు ఏం చెబుతున్నావో తెలుసుకో అని సూచించారు. క్రికెట్లో అత్యున్నత పదవిలో ఉన్న నీకు ఏ టోర్నమెంట్ జరుగుతుందో కూడా తెలియదా? అని ప్రశ్నించారు. దీంతో, తన తప్పును తెలుసుకున్న శుక్లా... ఆ ట్వీట్ ను తొలగించారు. ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్నది మహిళల వరల్డ్ కప్.
మరోవైపు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే తప్పు చేశాడు. కెప్టెన్ మిథాలీరాజ్ 6వేల పరుగులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. అయితే, మిథాలీరాజ్ బదులు వేరే క్రీడాకారిణి ఫొటో పెట్టాడు. అప్పుడు కూడా నెటిజన్లు కోహ్లీని చీల్చి చెండాడారు. మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరో కూడా నీకు తెలియదా? అంటూ విరుచుకుపడ్డారు. దీంతో, తన ట్వీట్ ను కోహ్లీ తొలగించాల్సి వచ్చింది.