: భారత్‌కు ఆయుధ సామాగ్రి కొరత ఉంది: కాగ్ రిపోర్ట్
ఒకవేళ యుద్ధం వస్తే పది రోజులకు సరిపడే యుద్ధ సామాగ్రి కూడా భారత్ వద్ద లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును శుక్రవారం పార్లమెంట్‌లో కాగ్ ప్రవేశపెట్టింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుల పనితనం సన్నగిల్లడం వల్లే ఈ ఆయుధ సామాగ్రి కొరత ఏర్పడిందని కాగ్ వెల్లడించింది. `2016 సెప్టెంబర్ నుంచి ఆయుధ సామాగ్రి సమకూర్చడంలో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు. కనీస అవసరానికి కంటే తక్కువగా యుద్ధ సామాగ్రి అందుబాటులో ఉంది. ఇవన్నీ కలిపినా 10 రోజుల పాటు కూడా యుద్ధం చేయలేం` అని కాగ్ నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా ఫిరంగి దళం, యుద్ధ ట్యాంకుల కొరత చాలా తీవ్రస్థాయిలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. పెద్ద ఆయుధాలను ట్రిగ్గర్ చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ ప్యూజ్‌ల కొరత ఎక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని ఫిరంగి దళ మాజీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది తెలిపారు.
అలాగే ఈ నివేదికలో... యుద్ధ సామాగ్రి అభివృద్ధి పేరుతో అనవసర ఖర్చులు చేస్తున్నారని కూడా కాగ్ వివరించింది. గతంలో రూ. 1.26 కోట్ల వ్యయంతో ఉత్తర కమాండ్ అవసరాల కోసం తయారుచేయించిన 50 ఔట్‌బోర్డ్ మోటార్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని కాగ్ స్పష్టం చేసింది. గడచిన 7 ఏళ్లలో 46 ఔట్‌బోర్డ్ మోటార్స్‌ను కేవలం పది గంటల పాటే ఉపయోగించినట్టు కాగ్ తెలిపింది.