: ఇస్లాంలోకి మారకపోతే కాలు తీసేస్తాం: రచయితకు బెదిరింపులు
కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మలయాళం రచయిత కేపీ రమనుణ్నికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ లేఖ పంపించారు. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారకపోతే కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామని ఆ లేఖ ద్వారా బెదిరించారు. ఆరు రోజుల క్రితం అందిన ఈ లేఖపై సీనియర్ రచయితల సలహా మేరకు రమనుణ్ని కోజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖ కేరళలోని మలప్పురం జిల్లాలో మంజేరీ ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల రమనుణ్ని రాసిన వ్యాసాల వల్ల ముస్లిం యువత తప్పుదోవ పడుతున్నారని, ఆరు నెలల్లోగా ముస్లింగా మారి, ఇస్లాం మతానికి సేవ చేయకపోతే అల్లా ఆదేశానుసారం అధ్యాపకుడు టీఎస్ జోసెఫ్‌కు పట్టిన గతే రమనుణ్నికి పడుతుందని ఆ లేఖలో రాశారు. గతంలో ముస్లిం మతాచారాలను కించపరిచేలా ప్రశ్నాపత్రం తయారుచేశాడన్న నెపంతో కొందరు ముస్లిం రాడికల్ వాదులు తోళుపుర న్యూ మ్యాన్ కళాశాల అధ్యాపకుడు టీఎస్ జోసెఫ్ కుడి భుజం నరికేశారు. రమనుణ్ని ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు.