: కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్ అబ్దుల్లా
కశ్మీర్ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్లమెంటు సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ‘మూడో వ్యక్తి’ జోక్యం అవసరమని ఆయన అన్నారు. సుదీర్ఘంగా పరిష్కారం కాని కశ్మీర్ సమస్యను మధ్యవర్తిత్వంతోనే పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై ‘మధ్యవర్తిత్వం' వహించేందుకు అమెరికా, చైనాలు ముందుకు వచ్చినా మనం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. పాక్ దగ్గర అణుబాంబులున్నాయి, భారత్ వద్ద కూడా అణుబాంబులున్నాయి. దీని వల్ల ఎంత మంది చనిపోవాలంటూ ఆయన ఉద్రిక్తతలు రాజేసే ప్రయత్నం చేశారు.
కాగా, కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఏనాడూ ప్రకటించనప్పటికీ ఐక్యరాజ్యసమితిలోని యూఎస్ రాయబారి నిక్కీ హెలీ ఏప్రిల్ లో చేసిన వ్యాఖ్యలు ఆయన మధ్యవర్తిత్వానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. డోక్లాం వివాదం నేపథ్యంలో పాక్ తరపున యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు దేశాలు కశ్మీర్ అంశంపై మద్యవర్తిత్వం వహిస్తామని చెప్పనప్పటికీ... ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆయన ఆ రెండు దేశాలను మధ్యవర్తిత్వానికి ఆహ్వానిస్తున్నట్టుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.