: ఇక పబ్ ల వంతు.. నేడు 17 పబ్ ల నిర్వాహకులతో అకున్ సబర్వాల్ భేటీ!
హైదరాబాదులోని పబ్ లు డ్రగ్స్ అడ్డాలన్న అనుమానాలు టాలీవుడ్ ప్రముఖుల విచారణ అనంతరం నిర్ధారణ అయ్యాయి. దీంతో సిట్ అధికారులు తమ విచారణను విస్తృతించారు. తొలుత స్కూళ్లపై దృష్టి పెట్టిన సిట్ తరువాత డ్రగ్స్ పెడ్లర్స్, డీలర్స్, తరువాత పలుకుబడి కలిగిన వారు .. చివరగా టాలీవుడ్ ప్రముఖులను విచారించింది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాదులోని పబ్స్ లో వెస్ట్రన్ కల్చర్ విస్తృతంగా ఉందని గుర్తించారు. దీంతో దాని ప్రక్షాళనకు నడుం బిగించారు. హైదరాబాదులోని 16 పబ్ ల యజమానులకు నోటీసులు పంపారు. వారందరికీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నేడు సమావేశానికి హాజరుకావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ 16 పబ్ లలో సినీ నటుడు తరుణ్ కు చెందిన ఆన్ పబ్, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ తోపాటు 10 డౌన్ స్ట్రీట్, వాటర్స్, లిక్విడ్, బీర్స్, డూప్లిన్, క్లౌడ్ డౌన్, ప్లేబాయ్, బీ అండ్ సీ, కిస్మత్, ఎయిర్, రక్స్, స్టోన్ వాటర్స్, ఓవర్ ద మూన్, హార్ట్ కప్ కాఫీ, బీట్స్ పర్ మినిట్, డాక్ వంటి పబ్ లు ఉన్నట్టు తేల్చారు. ఈ పబ్బుల్లోనే కెల్విన్, జీషన్ అలీ లాంటి డ్రగ్ పెడ్లర్లు సినీ ప్రముఖులను కలిసేవారని, వీకెండ్ లో ఈ పబ్ లు పెద్ద పెద్ద అంగళ్లను తలపించేవని వారు గుర్తించారు. నైజీరియన్ ముఠాలతో పాటు లోకల్ డ్రగ్ పెడ్లర్లు కూడా ఈ పబ్బుల్లో సందడి చేసేవారని ఆధారాలు సంపాదించారు. ఇక్కడే డ్రగ్స్ కొనుక్కుని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారేవని కూడా సిట్ అధికారులు గుర్తించారు.
దీంతో ఆయా పబ్బుల సీసీ పుటేజ్ ను స్వాధీనం చేసుకుని, డ్రగ్స్ రుచుల వీరుల వివరాలు నిర్ధారించుకున్నారు. పబ్బుల్లో వారు చేసే నిర్వాకాలను కూడా వారికే చూపించి, కూపీ లాగడం మొదలు పెట్టారు. దీంతో వీరి భరతం పట్టాలని నిర్ణయించిన అధికారులు నేడు వారితో భేటీకి ముహూర్తం కూడా పెట్టేశారు. దీంతో హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ శివార్లలో కూడా ఉన్న మొత్తం 30 పబ్ లలో 17 పబ్ ల యాజమానులు, మేనేజర్లను ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు వీరితో భేటీ జరగనుంది. అనంతరం వారిని విచారించనున్నారు. విచారణలో ఎక్కువ తక్కువలు చేస్తే.... వారి పబ్ లోని సీసీటీవీ పుటేజ్ ను వారికి చూపించనున్నారు. పబ్బులకు ఎవరెవరు వచ్చేవారు?, రెగ్యులర్ కస్టమర్లు ఎవరు?, ఎలాంటి డ్రగ్స్ ను మీమీ పబ్ లలో విక్రయించేవారు? ఎవరెవరు ఎలాంటి డ్రగ్స్ వినియోగిస్తుంటారు?, సరఫరాదారులెవరు? వంటి విషయాలన్నీ రాబట్టనున్నారు.