: సుబ్బరాజు విచారణలో మరికొందరు నటుల పేర్లు వెల్లడి.. సోమవారం నోటీసులు?
డ్రగ్స్ కేసులో మరొక సినీ ఫ్యామిలీ పేరు బయటపడినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో దశాబ్దాలుగా ఉన్న ఓ సినీకుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు సోమవారం లేక మంగళ వారం రోజున ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు వెళ్లనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు సినీ ప్రముఖులను విచారించిన సిట్ ఈ రోజు నటుడు సుబ్బరాజును సుదీర్ఘంగా విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మరికొందరి సినీనటుల పేర్లు బయటపడినట్లు తెలుస్తోంది.
సుబ్బరాజు ఈ రోజు చెప్పిన సినీ ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోన్న అధికారులు వాటికి గల ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఓ సినీకుటుంబం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కెల్విన్ గ్యాంగ్ పట్టుబడడం, వారినుంచి కీలక సమాచారం లభ్యమవడంతో మాదకద్రవ్యాల కేసులో అధికారులు విచారణను ముమ్మరం చేసింది. సినీ ప్రముఖులను విచారిస్తుండడంతో మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.