: విచారణ పధ్ధతి సీక్రెట్... టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో తనదైన శైలిలో ముందుకెళ్తున్న అకున్ సబర్వాల్!
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో శరవేగంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ తన సెలవులను సైతం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులను విచారణ చేయాల్సి ఉండడంతో ఆయన ఈ కేసులో అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు. తాము టాలీవుడ్ ప్రముఖులని ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నామనే విషయాన్ని కూడా ఆయన బయటకు రానివ్వడం లేదు. విచారణ జరిపే సిట్ అధికారులకు తప్ప అక్కడి సిబ్బందికి కూడా ఈ వ్యవహారాన్ని తెలపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
సిట్ బృందంలోని సభ్యుల్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవర్ని ఏయే అంశాలపై ప్రశ్నించాలి, ఎటువంటి సమాచారం రాబట్టాలనే విషయాలపై ఎంతో స్పష్టతతో ఉన్నారు. సినీ ప్రముఖులు అసత్యాలు చెప్పే అవకాశాలు ఉండడంతో వారి నుంచి నిజాలు రాబట్టడానికి అవసరమైన పలు ఆధారాలను సిద్ధం చేసుకున్నాకే విచారణ ప్రారంభించారు. ఒక్క రోజులో జరిగే ఇంటరాగేషన్‌ను రెండు, మూడు సెషన్స్‌గా విభజించి ముందుకెళుతున్నారు. ఒక్కో సెషన్‌లో ప్రశ్నించే బాధ్యతను ఒక్కో టీమ్‌కి అప్పగిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉంటారో చివరి నిమిషం వరకు ఎవ్వరికీ తెలియదు. ఇందుకుగానూ 25 మంది అధికారులను వినియోగిస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ ప్రముఖులు గదిలోకి వెళ్లడానికి ముందు ఎంపికచేసిన అధికారులతో అకున్ సభర్వాల్ కాసేపు చర్చిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించిన అనంతరం అందుకు సంబంధిత ఫైల్ ని అధికారులు అకున్ సబర్వాల్ కు ఇచ్చి వెళ్తున్నారు. అలాగే తమను ఎవరు విచారిస్తారో తెలుసుకునే అవకాశం కూడా టాలీవుడ్ ప్రముఖులకి లేదు. ఇప్పటికి ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు ఈ రోజు నటుడు సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న మరో తొమ్మిది మందిని విచారించాల్సి ఉంది. వారందరి విచారణకూ ఇదే పద్ధతిని అవలంబిస్తారు.