: 8 శాతం స్థిర వడ్డీరేటుతో వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వ పింఛను!
ఎల్ఐసీ ఆధ్వర్యంలో ప్రధాన్‌మంత్రి వయో వందన యోజన (పీఎంవీవీవై) అనే పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి 8 శాతం స్థిర వడ్డీరేటుతో పింఛను అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం మే 4, 2017 నుంచి మే 3, 2018 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతుంది. పదేళ్ల కాలం పాటు ఉండే ఈ పాలసీలో పాలసీదారు కోరుకున్న విధంగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, పన్నెండు నెలల పద్ధతిలో పింఛను అందుతుంది.
ఈ పాలసీపై జీఎస్‌టీ మినహాయింపు కూడా కల్పించడంతో పాటు, కొనుగోలు ధరపై 75 శాతం రుణసదుపాయం కూడా ఉంది. అయితే పాలసీ కాలం మూడేళ్లు పూర్తైన తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. ఒకవేళ రుణం తీసుకుంటే దానిపై వడ్డీని పింఛను వాయిదాల్లో చెల్లించుకుంటారు. పాలసీ మధ్యలో ఏదైనా అనారోగ్యం వస్తే ఈ పథకం నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అలా వెళ్తే 98 శాతం కొనుగోలు ధరను చెల్లిస్తారు. అలా కాకుండా పాలసీదారు మరణిస్తే పూర్తి కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు.