: లాలూ కుమారుడి పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దు!


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు భారత్ పెట్రోలియం సంస్థ షాక్ ఇచ్చింది. పాట్నాలో ఉన్న అతని పెట్రోల్ బంక్ లైసెన్సును రద్దు చేసింది. ఈ బంక్ లైసెన్స్ ను రద్దు చేయాలని గతంలోనే భారత్ పెట్రోలియం నిర్ణయించింది. అయితే, దీనిపై పాట్నాలోని ఓ కోర్టులో తేజ్ ప్రతాప్ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో, భారత్ పెట్రోలియం టెర్మినేషన్ ఆర్డర్ పై సదరు కోర్టు స్టే విధించింది. తాజాగా, రెండు రోజులు క్రితం తాను ఇచ్చిన స్టేను కోర్టు ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో, పెట్రోల్ బంక్ లైసెన్స్ ను భారత్ పెట్రోలియం రద్దు చేసింది.

పెట్రోల్ బంక్ కు సంబంధించి భారత్ పెట్రోలియం గత మేలో ఓ ప్రశ్నావళిని తేజ్ ప్రతాప్ కు పంపింది. పెట్రోల్ బంక్ ను ఎలా పొందారు? చట్ట విరుద్ధంగా పెట్రోల్ బంక్ ను పొందారని, ఆస్తుల జాబితాలో దాన్ని చూపించలేదని విపక్ష జీజేపీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో.. దాని లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదు? లాంటి ప్రశ్నలను ప్రశ్నావళిలో పొందుపరిచింది. అయితే, ఈ పెట్రోల్ బంక్ ప్రస్తుతం పని చేయడం లేదని, అందువల్లే దాన్ని ఆస్తుల జాబితాలో చూపించలేదని ఆర్జేడీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో, తేజ్ ప్రతాప్ పెట్రోల్ బంక్ లైసెన్సును భారత్ పెట్రోలియం రద్దు చేసింది.

  • Loading...

More Telugu News