: అత్యంత తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్: ముఖేష్ అంబానీ


విశ్లేషకులు ముందుగా ఊహించినట్టుగానే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత చౌక ధరకు 4జీ ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వాయిస్ కమాండ్ తో కాల్స్, మెసేజ్ లు చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని తెలిపారు. ఇండియాలో మొత్తం 78 కోట్ల మొబైల్ ఫోన్లు ఉండగా, వాటిల్లో 50 కోట్లకు పైగా ఫోన్లు ఫీచర్ ఫోన్లేనని గుర్తు చేసిన ముఖేష్ అంబానీ, వారందరినీ డిజిటల్ గొడుగు కిందకు తీసుకు వస్తామని అన్నారు. వారందరికీ తక్కువ ధరకు 4జీ సేవలను దగ్గర చేసేందుకు నిర్ణయించుకున్న తరువాతనే, అత్యంత తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్ ను అందించాలని ముందడుగు వేసినట్టు తెలిపారు. చౌక ధరలో డేటా సాయంతో వాయిస్ కాల్స్ చేసుకునే ఫోన్ తయారీకి ఎంతో శ్రమించామని, ఈ రోజు నుంచి ఫీచర్ ఫోన్ల నుంచి కాల్స్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించే అగత్యం తప్పిపోనుందని ప్రకటించారు. కనెక్టివిటీ, అఫర్డబిలిటీ, డేటా స్పీడ్ ఆధారంగా ఫీచర్ ఫోన్ ను తయారు చేశామని చెప్పారు.

ప్రస్తుతం ఫీచర్ ఫోన్ యూజర్లు నిమిషం కాల్ కు రూ. 1.20 నుంచి రూ. 1.50 వరకూ, ఒక జీబీ డేటాకు రూ. 4 వేల నుంచి రూ. 8 వేల వరకూ, ఎస్ఎంఎస్ కు రూ. 1 నుంచి రూ. 1.50 చెల్లిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. వచ్చే 12 నెలల కాలంలో దేశంలోని 99 శాతం మందికి జియో సిగ్నల్స్ దగ్గరవుతాయని తాను గర్వంగా చెబుతున్నట్టు ముఖేష్ వెల్లడించారు. 2జీ కవరేజ్ కన్నా 4జీ కవరేజ్ అధికంగా ఉండేలా చేయడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. 2జీ విస్తరణకు 25 సంవత్సరాలు పడితే, తాము మూడేళ్లలోనే 4జీని దేశవ్యాప్తం చేశామని తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఇండియాలో జియో ఆఫీసుల సంఖ్య 10 వేలకు చేరుతుందని, అన్ని చిన్న, పెద్ద పట్టణాలకూ విస్తరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News