: నిద్రపోతే అతని ప్రాణం పోతుంది... అందుకే ఆ యువకుడి నిద్రకు ప్రత్యేక ఏర్పాటు!
బ్రిటన్ కు చెందిన లియామ్ డెర్బీషైర్ అనే యువకుడికి ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ లేదా ‘ఆన్ డైన్స్ కర్స్’ అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున నిద్రపోతే, ఊపిరి ఆగిపోతుంది. నిద్రాణ స్థితిలో ఉంటే వారి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో వారు నిద్రలోకి జారుకున్న వెంటనే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో లియామ్ డెర్బీషైర్ కు నిద్రకరవైంది. ఈ వ్యాధి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. ఇంత తీవ్రమైన అరుదైన వ్యాధి లియామ్ కు పుట్టుకతోనే వచ్చింది. దీంతో పుట్టగానే ఆరు వారాలకు మించి లియామ్ బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికి చికిత్స కూడా లేదని వారు స్పష్టం చేశారు. దీంతో లియామ్ తల్లిదండ్రులు తమ బిడ్డ మరణించకూడదని భావించారు. దీంతో తమ శాయశక్తులు ధారపోసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
లియామ్ నిద్రపోయినా అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా, పని చేసేలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆరువారాలకు మించి బతకడన్న లియామ్ పద్దెనిమిదేళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా బతికేస్తూ మృత్యువుని ఓడిస్తూనే ఉన్నాడు. అతనికోసం ప్రత్యేకంగా బెడ్ రూం నిర్మించారు. అందులో లియామ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందేలా ఏర్పాట్లు చేశారు. గుండె ద్వారా ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేశారు. అయితే లియామ్ నిద్రలోకి జారుకున్న అనంతరం ఈ ప్రక్రియను నిరంతరం ఒకరు పర్యవేక్షించాలి. దీంతో నిపుణుడ్ని లియామ్ కోసం అతని తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. బెడ్ రూంలో జరిగే ప్రతి అంశాన్ని సమన్వయంతో వారు పరిశీలిస్తున్నారు. దీంతో గత పద్దెనిమిదేళ్లుగా కంటికి రెప్పలా అతన్ని కాపాడుకుంటున్నారు.