: 'వెంకయ్య పేరును తానే ప్రతిపాదించా'నంటూ సోషల్ మీడియాలో జగన్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై 'సాక్షి' ఆగ్రహం!
సాక్షి దినపత్రికకు అనుబంధంగా నడుస్తున్న సాక్షి వెబ్ సైట్ పేజీలను మార్ఫింగ్ చేసి, ఫోటోషాప్ సాయంతో మార్చి తమ పాఠకులను తప్పుదారి పట్టిస్తున్నారని, తప్పుడు కథనాలు సృష్టించి సోషల్ మీడియాలో వాటిని పెడుతున్నారని సాక్షి యాజమాన్యం ఆరోపించింది. 'వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే: జగన్' అన్న పేరిట సాక్షి వెబ్ సైట్ లో ఓ కథనం వచ్చిందని సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ కాగా, దీనిపై సాక్షి వెబ్ సైట్ స్పందించింది.
గుర్తు తెలియని వ్యక్తుల పనే ఇదని, దీనికి, తమకు సంబంధం లేదని తెలిపింది. కాగా, ఈ కథనంలో వైఎస్ఆర్ తన కలలో కనిపించి రాష్ట్రానికి వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలను ప్రస్తావించి, ఆయనకు కృతజ్ఞతగా ఏదైనా చేయాలని కోరారని జగన్ చెప్పినట్టు ఉంది. ఆపై తనకు ఉప రాష్ట్రపతి ఆలోచన వచ్చి, అమిత్ కు చెప్పినట్టు జగన్ పేర్కొన్నట్టు ఉండటం గమనార్హం. వెంకయ్య పేరును చెప్పిన తరువాత, మోదీ పొగడుతూ, చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలు ఉన్న నీవు స్వాతిముత్యం అని తనను పొగిడారని జగన్ చెప్పినట్టు ఉంది.