: సిట్ అధికారులు సినీ పరిశ్రమలోని వారిని ఇలా విచారిస్తున్నారు... వారిని అడుగుతున్న ప్రశ్నలివే!
సినీ పరిశ్రమలో డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన వారిని సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా జరుగుతున్న విచారణ మరో ఐదు రోజులపాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయానికి లాయర్ తో కలిసి వచ్చే సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారిస్తున్న విధానం ఎలా ఉందంటే.... సిట్ కార్యాలయంలోకి వారు ప్రవేశించిన దగ్గర్నుంచి సీసీ కెమెరాలు వారిని నిశితంగా గమనిస్తుంటాయి. అనంతరం సిట్ అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై ప్రశ్నలు సంధిస్తారు. సినీ పరిశ్రమలో డ్రగ్స దందా గురించి మీకు తెలిసింది చెప్పండి అనగానే వచ్చిన వారంతా తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. దీంతో పార్టీల్లో పాల్గొన్న ఫోటోలు బయటపెడుతున్నారు.
పార్టీలు సహజం అనగానే... డ్రగ్ పెడ్లర్ తో ఉన్న ఫోటో చూపిస్తున్నారు. అభిమానులతో ఫోటోలు దిగుతుంటాం...అలాగే అతను కూడా తీసుకున్నాడని చెప్పగానే... డ్రగ్ పెడ్లర్ తో దిగిన సెల్ఫీని చూపిస్తున్నారు. అది కూడా యాదృచ్చికం అంటే మాత్రం... అతనితో జరిపిన ఫోన్ సంభాషణ, లేదా ఛాట్ వివరాలను అతని ముందు ఉంచుతున్నారు. దీంతో అవాక్కైన సినీ ప్రముఖులు తమ తప్పు ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తారా? లేదా? అన్న అంగీకారపత్రాన్ని కూడా వారి లాయర్ సమక్షంలో తీసుకుంటున్నారు.