: డ్రగ్స్ కేసులో కేటీఆర్ ప్రమేయంపై విచారణ జరపాలి: షబ్బీర్ అలీ


డ్రగ్స్‌ కేసులో మంత్రి కేటీఆర్‌ ప్రమేయంపై విచారణ జరపాలని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. హైదరాబాదులోని గాంధీభవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఓటుకు నోటు కేసులోనూ భారీగా ప్రకటనలు చేసి, మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంసెట్‌ కుంభకోణంలో కూడా ప్రకటనలకే విచారణ పరిమితమైందని తెలిపారు.

కరుడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌ కౌంటర్‌ కేసులో కూడా ఎవరినీ వదిలిపెట్టమన్నారు... నేతల పాత్రపై కనీస విచారణ కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసులో కేటీఆర్‌ పాత్రపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని ఆయన తెలిపారు. డ్రగ్స్‌ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మియాపూర్‌ భూముల కుంభకోణంలో ఇప్పటిదాకా చేసిందేమీ లేదని, ఆ కేసును కూడా సెన్సేషన్ చేసిన తరువాత కోల్డ్ స్టోరేజీలో పెట్టారని ఆయన విమర్శించారు. 

  • Loading...

More Telugu News