: కెల్విన్ 'సెల్ఫీ'లతో ఆటకట్టిస్తున్న సిట్ అధికారులు!
హైదరాబాదులో పెను కలకలం రేపిన డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల పేర్లు వెల్లడికావడంతో ఎవరికి వారు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ అంటే ఏంటో తెలియదని, జీవితంలో అసలు వాటిని తాను చూడనేలేదని, చాలా కష్టాలు పడి నిలదొక్కుకున్నానని, తనపై ఇలాంటి వదంతులు బాధిస్తున్నాయని, మీడియాకు ఏమీ తెలియకుండా రాసేస్తోందని పలువురు గగ్గోలు పెట్టారు. పనిలో పనిగా మీడియాను ఆడిపోసుకున్నారు. అనంతరం సిట్ ముందు ఇప్పటికి ఇద్దరు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు.... తమకు కెల్విన్ అంటే ఎవరో తెలియదని, డ్రగ్స్ తో తమకు సంబంధం లేదని, తాము చాలా పరువు మర్యాదలుగలవారమని చెప్పుకొచ్చారు.
దీంతో సిట్ అధికారులు కెల్విన్ తో సినీ ప్రముఖులు దిగిన ఫోటోలను వారి ముందు పెట్టి... ఇవి ఎవరివి? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో వీరి నోళ్లు మూతపడ్డాయని తెలుస్తోంది. కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమయంలో సినీ తారలతో సెల్ఫీలు దిగేవాడు. ఆ సెల్ఫీలపై తేదీ సమయం కూడా నమోదయ్యేవి. సరిగ్గా సెల్ఫీ దిగేందుకు కాస్త ముందో, వెనుకో కెల్విన్ తో జరిపిన సంభాషణల వివరాలు కూడా సిట్ వద్ద వున్నాయి. అంతే కాకుండా, కెల్విన్ ను విచారించిన పోలీసులు మరింత విలువైన సమాచారం సంపాదించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు మీడియాను బుకాయించగలిగినా... అధికారుల మందు మాత్రం నీళ్లు నములుతున్నారు.