: శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ వ్యవహారంలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు.. ఇంకా పరారీలోనే క్యాబ్ డ్రైవర్
ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన గద్వాలకు చెందిన వైద్య విద్యార్థి శ్రీకాంత్ గౌడ్ వ్యవహారంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతడిని కిడ్నాప్ చేసిన దుండగులు చివరికి మీరట్‌లో పోలీసుల చేతికి చిక్కారు. ప్రధాన నిందితుడు, క్యాబ్ డ్రైవర్ అయిన సుశీల్, అతడి సోదరుడు అనుజ్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా, శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు 13 రోజులపాటు హరిద్వార్, ముజఫర్ నగర్, బులంద్‌షహర్ తదితర ప్రాంతాల్లో తిప్పినట్టు ఢిల్లీ ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రవీందర్ యాదవ్, ఏసీపీ రాహుల్‌లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కోసం రెస్య్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న 200 మంది పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఈనెల 6న శ్రీకాంత్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆ క్యాబ్ డ్రైవర్ సుశీల్ కిడ్నాప్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరినైనా కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో శ్రీకాంత్ క్యాబ్ బుక్ చేసుకోవడంతో తన వ్యూహాన్ని అమలులో పెట్టాడు. ప్రీతి విహార్ రైల్వే స్టేషన్ వద్ద శ్రీకాంత్‌ను ఎక్కించుకున్న సుశీల్ మరో ప్రాంతంలో తన తమ్ముడు అనూజ్, బావమరిది ప్రమోద్, స్నేహితులు సోన్‌వీర్, అమిత్, వివేక్‌లను ఎక్కించుకుని శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేశారు. రూ.5 కోట్లు ఇస్తేనే వదిలేస్తామని ఓలా యాజమాన్యానికి ఫోన్ చేశారు. ఓలా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కిడ్నాపర్లు కారులోని జీపీఎస్‌ను ఆఫ్ చేశారు. అనంతరం శ్రీకాంత్‌ను 13 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లోని చెరుకు తోటలో దాచారు.
పోలీసులు అక్కడికి వెళ్లగా కిడ్నాపర్లు వారిపై కాల్పులు జరిపి తప్పించుకు పారిపోయారు. అక్కడి నుంచి వారు మీరట్‌లోని శతాబ్దినగర్‌కు వెళ్లగా ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో శ్రీకాంత్‌ను దాచిన ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ మరోమారు కాల్పులు జరిగాయి. చివరికి పోలీసులు విజయం సాధించారు. సోన్‌వీర్, అమిత్, ప్రమోద్, గౌరవ్‌శర్మలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సుశీల్, అనుజ్, వివేక్‌ల కోసం గాలిస్తున్నారు.
.