: నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? నన్ను టార్గెట్ చేస్తున్నారా? అనిపిస్తోంది: పూరీ జగన్నాథ్
ఇదంతా చూస్తుంటే, తనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? తనను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? అని అనిపిస్తోందని డ్రగ్స్ కేసు వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇవే పనులు, తప్పులు అందరూ చేస్తున్నారు కానీ, సినిమా వాళ్లు ఎవరైనా చిన్న తప్పు చేస్తే కొండంతలు చేస్తున్నారని అన్నారు. తనపై డ్రగ్స్ ఆరోపణలు రావడం చాలా బాధనిపించిందని, ఒక్క రోజులో వంద ఆరోపణలు విని హర్టయ్యానని.. అయితే, తన నుంచి క్లారిటీ తీసుకోవడం కోసమే అధికారులు తనకు నోటీసులిచ్చారని చెప్పారు.
తనపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి కుటుంబసభ్యులు బాధపడ్డారని, ఏ కష్టం వచ్చినా ఎవరూ ఉండరని, మనల్ని మనమే కాపాడుకోవాలని అనుకుంటానని చెప్పారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పానని, డ్రగ్సే కాదు అలాంటి పనులు ఏవీ చేయనని చెప్పారు. తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డానని, ఓ సమయంలో అన్నీ అమ్మేసుకున్నానని, ఆ తర్వాత తన స్వశక్తితో మళ్లీ ఎదిగి బాగుపడ్డానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.