: కోవింద్ నివసించే కాలనీలో సంబరాలు!
రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక కావడంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న మహర్షి దయానంద్ విహార్ కాలనీలోని మినీ హెచ్ఐజీ నివాసంలో కోవింద్ పదిహేనేళ్లుగా నివసిస్తున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక కావడంతో కాలనీ వాసులు సంబరాల్లో మునిగిపోయారు.
ఈ సందర్భంగా, ఆ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. కోవింద్ నివాసం పక్కనే నివసించే దేవేంద్ర జునేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవింద్, తాను కలిసి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. కోవింద్ వద్ద రెండు సార్లు పీఆర్వోగా పని చేసిన అలోక్ త్రివేది మాట్లాడుతూ, సుమారు ఐదేళ్ల క్రితం తన భార్య చనిపోయిన సందర్భంలో కోవింద్ తమ ఇంటికి వచ్చి పరామర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.