: వ్యభిచార గృహం నుంచి పెళ్లి పీటల మీదికి.... ఢిల్లీలో ఓ `జ్యోతిలక్ష్మి` ప్రేమకథ!
ఢిల్లీలోని జీబీ రోడ్, నెంబర్ 68 ప్రాంతంలోని వ్యభిచార గృహాంలో తను కష్టాలు పడుతుండేది. ఈ క్రమంలో తన దగ్గరకు తరచుగా వచ్చే యువకుడితో ప్రేమలో పడింది. అలా రెండేళ్లు గడిచాయి. ఒకరోజు ఆమె ఎలాగైనా తనని ఈ కూపం నుంచి బయటపడేయమని అతనిని కోరింది. ఆమెపై ఉన్న ప్రేమతో ఆ యువకుడు ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాడు. ఇంకేం ఆపరేషన్ ప్రారంభమైంది. విజయవంతంగా వ్యభిచార గృహం నుంచి ఆ అమ్మాయిని బయటకు తీసుకురాగలిగారు.
తర్వాత ఆ అమ్మాయికి అండగా నిలబడతానని ప్రమాణం చేస్తూ తన కుటుంబ సభ్యులు, కమిషన్ సమక్షంలో నిన్న ఆర్యసమాజంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు అతన్ని మెచ్చుకున్నారు. ఊరికే మాటలు చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు, నీలా చేసి చూపించేవారు తక్కువ మంది ఉంటారు అంటూ పొగిడారు. `ఈ జంట తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. జీబీ రోడ్‌లో ఇలాంటి బాలికలు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ మేం రక్షిస్తాం` అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.