: మంచిర్యాలలో దారుణం... అనుమానంతో భార్యను అడవిలో విడిచిపెట్టిన భర్త


పెంచుకున్న అనుమానం తార‌స్థాయికి చేర‌డంతో ఓ భ‌ర్త త‌న భార్య‌ను అడ‌విలో వ‌దిలేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని కుర్రెఘడ్‌ పునరావాస కాలనీలో నివ‌సించే సోనెరావు అనే వ్య‌క్తి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. మూడు రోజులుగా సోనెరావు భార్య‌ గంగుబాయి కనిపించ‌క‌పోవ‌డంతో ఆమె బంధువులు మొన్న‌ రాత్రి దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డంతో ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంగుబాయి అడ‌వుల్లో ఉంద‌ని తెలుసుకున్నారు.

ఓ మ‌హిళ ఒంట‌రిగా పాత తిరుమలాపూర్‌ అటవీ ప్రాంతంలో క‌నిపించింద‌ని తిరుమలాపూర్‌ గ్రామస్తులు త‌మ‌కు ఇచ్చిన స‌మాచారంతో ఆమెను తీసుకురావ‌డానికి పోలీసులు వెళ్లారు. అయితే, ఆమె అప్ప‌టికే అడ‌వుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డి అక్క‌డి ద‌గ్గ‌ర‌లో ఉన్న బంధువుల ఇంట్లో ఉంద‌ని పోలీసుల‌కు తెలిసింది. ఆమెను భ‌ర్త సోనెరావు అనుమానంతో చావ‌బాది, అడ‌వుల్లో విడిచిపెట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News