: మా రవిశాస్త్రి వచ్చేశాడు... ఇకంతా సరదాయే: సంబరపడిపోతున్న ఉమేష్ యాదవ్
భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి రావడంపై క్రీడాభిమానులు ఎలా స్పందిస్తున్నా, ప్రధాన పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మాత్రం సంబరపడిపోతున్నాడు. రవిశాస్త్రి రాకతో ఇకపై డ్రస్సింగ్ రూములో ఆహ్లాదకర వాతావరణం పెరుగుతుందని, తామంతా సరదా సరదాగా గడపబోతున్నామని అన్నాడు. శ్రీలంక టూర్ కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఉమేశ్, రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పునరాగమనాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పాడు. వారిద్దరూ చాలా సరదాగా ఉంటారని, వారి రాకతో లంక పర్యటన సైతం సరదాగానే సాగనుందని అన్నాడు. ఇక అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్న వేళ, ఆయనెంతో నేర్పారని అంటూనే, రవిశాస్త్రి, భరత్ అరుణ్ లు ఎలాంటి వ్యూహాలు పన్నుతారో తనకు తెలుసునని చెప్పుకొచ్చాడు. కాగా, లంక పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు ఈ నెల 26వ తేదీ నుంచి తొలి టెస్టులో ఆడనున్న సంగతి తెలిసిందే.