: 2032 ఒలింపిక్స్ భారత్‌లో? ... యోచిస్తోన్న క్రీడా మంత్రిత్వ శాఖ
ప్రపంచ ప్రఖ్యాత ఒలింపిక్ క్రీడలను 2032లో భారత్‌లో నిర్వహించేందుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక పురోగతి లేకున్నా 35వ ఒలింపిక్స్ నిర్వహించకుండా భారత్‌ను అడ్డుకోగల కారణాల గురించి క్రీడా మంత్రిత్వ శాఖ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. గతనెల భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ మాట్లాడుతూ - 2030 ఏషియన్ క్రీడలు, 2032 ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై క్రీడా మంత్రిత్వ శాఖ సుముఖంగానే ఉన్నా ఇంతకుముందు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం వల్ల ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై పడిన దెబ్బను చూసి వెనకడుగు వేస్తున్నారు. ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఆ దేశాలు లాభపడకపోగా నష్టాల పాలైన విషయం తెలిసిందే. ఒకవేళ 2032 ఒలింపిక్ క్రీడలు ఇక్కడ నిర్వహించాలనుకుంటే దీనికి సంబంధించిన బిడ్డింగ్ 9 సంవత్సరాల ముందుగా అంటే 2025లో వేయాల్సి ఉంటుంది. ఈలోగా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఒలింపిక్స్ నిర్వహణలో పెనవేసుకుని ఉన్న భారీ ఖర్చుల నేపథ్యంలో చాలా దేశాలు వాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 2024 ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతలను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పారిస్‌కు అప్పగించింది. 2028 ఒలింపిక్స్ నిర్వహణకు ఎక్కువ దేశాలు ముందుకు రాకపోవడంతో 2024 ఒలింపిక్స్ ఆతిథ్య పోటీలో మిగిలిపోయిన లాస్ ఏంజెల్స్‌కు అప్పజెప్పింది. నిజానికి ఏ దేశం కూడా రెండు సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించకూడదనే నిబంధన ఉంది. కాకపోతే పరిస్థితులు అనుకూలించకపోవడంతో 1984 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన లాస్ ఏంజెల్స్‌కే మళ్లీ పట్టం కట్టారు.