: పెళ్లి చేసుకునేందుకు కోట్ల రూపాయలతో ఢిల్లీకి వచ్చి చిక్కుకున్నానంటే, నమ్మి 74 లక్షలు సమర్పించుకున్న ముంబై యువతి!
సైబర్ క్రైం నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో, బ్యాంకు, కార్డుల పాస్ వర్డ్ వివరాలు తస్కరించడం క్లిష్టమవుతున్న నేపథ్యంలో నైజీరియన్ ముఠాలు డబ్బులను దండుకోవడానికి కొత్త ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తాజాగా ఓ ముంబై యువతిని వినూత్న తరహాలో మోసం చేశాడో నైజీరియన్. పెళ్లి నిమిత్తం కోట్లాది డాలర్లు తీసుకు వస్తున్నానని చెప్పి, ఆపై చిక్కుకుపోయానంటూ ఫోన్ చేసి ఏకంగా రూ. 74 లక్షలు గుంజేశాడు.
వివరాల్లోకి వెళితే, ముంబైలోని శివాజీ పార్కు సమీపంలో ఉండే 40 సంవత్సరాల యువతి, తన వివాహం నిమిత్తం ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ప్రొఫైల్ పెట్టింది. ఆపై కొన్ని రోజులకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. తనను తాను యూకేలో నివసిస్తున్న ఎన్నారైగా పరిచయం చేసుకున్న అమర్ జోషి అనే వ్యక్తి, యువతి ప్రొఫైల్, ఫోటోలు నచ్చాయని, తనకు ఓ భారతీయ భార్య కావాలని కోరుకుంటున్నానని, ఇష్టమైతే, పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. అతని ప్రొఫైల్ కూడా నచ్చడంతో, వారిద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై వారిద్దరి మధ్యా సంభాషణలు సాగుతుండగా, నిశ్చితార్థం చేసుకునేందుకు ముంబైకి వస్తున్నానని చెబుతూ, విమానం టికెట్ల వివరాలను అతను పంపాడు. రిసీవ్ చేసుకోవడానికి రావాలని కూడా కోరాడు.
అతన్ని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లిన యువతికి ఓ ఫోన్ వచ్చింది. తొలుత మాట్లాడిన అమర్, ఆపై మరో మహిళకు ఫోన్ ఇచ్చాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్ గా తనను తాను పరిచయం చేసుకున్న మహిళ, పరిమితికి మించిన యూఎస్ డాలర్లతో ఈ వ్యక్తి వచ్చాడని, రూ. 38 లక్షలు చెల్లిస్తేనే అతన్ని విడుదల చేస్తామని చెప్పింది. దీంతో ఆమె ఆ డబ్బును వారు చెప్పిన నాలుగు ఖాతాల్లో జమ చేసింది. తరువాతి రోజు, తాను ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, కాసేపట్లో వస్తున్నానని, అయితే ఇక్కడ కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని ఫోన్ చేశాడు. తాను త్వరగా బయటకు వచ్చేందుకు సహకరించాలని కోరితే, నమ్మిన ఆమె, మరో 6 బ్యాంకు ఖాతాల్లో రూ. 36 లక్షలు జమ చేసింది. ఆపై ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నుంచి స్పందన లేదు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ జరుపుతున్నారు.