: సిరియాలో యూఎస్ రహస్య స్థావరాలను బయటపెట్టిన టర్కీ మీడియా... భయపడుతున్న పెంటగాన్!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పీచమణిచేందుకు సిరియాలో తాము ఎక్కడెక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న విషయాలను టర్కీ మీడియా వెల్లడించడంతో యూఎస్ మిలటరీ కేంద్రం పెంటగాన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. టర్కీ మీడియా అమెరికన్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్న విషయాలతో పాటు ఎన్ని ప్రాంతాల్లో యూఎస్ సైన్యం ఉందన్న జాబితాను విఫులంగా ప్రచురించింది.
దీనిపై పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, "ఈ కథనాల్లో వెల్లడించిన ప్రాంతాల జాబితాను ఏ వర్గాల నుంచి సేకరించారన్న సమాచారం మా వద్ద లేదు. ఈ విషయమై నాటో అధికారులతో మాట్లాడుతున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. స్థావరాల జాబితా విడుదల కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం" అని పేర్కొంది. ఈ స్థావరాల వివరాలను సంకీర్ణ దళాల్లోని ఇతర దేశాల సైన్యానికి కూడా ఇంతవరకూ తాము వెల్లడించలేదని, ఎలా ఈ లిస్టు బయటకు వచ్చిందో విచారిస్తామని పెంటగాన్ పేర్కొంది.
కాగా, టర్కీ న్యూస్ ఏజన్సీ 'అనడోలు' అమెరికన్ స్థావరాల గురించి గ్రాఫిక్ మ్యాప్స్ సహా ప్రచురిస్తూ, ఓ కథనాన్ని వెలువరించగా, దాన్ని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ నియంత్రణలో ఉన్న సిరియా ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. ఇక ఈ కథనాలతో అమెరికా నేతృత్వంలో సాగుతున్న ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి అవాంతరాలను తెచ్చి పెట్టవచ్చని పెంటగాన్ భావిస్తోంది.