: ఆ 39 మంది భారతీయుల పరిస్థితి గురించి ఏం చెప్పలేం: ఇరాకీ విదేశాంగ ప్రతినిధి ఫక్రీ అల్ ఇస్సా
ఇరాక్‌లో జూన్ 2014 నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన 39 మంది భారతీయులు జీవించి ఉన్నారా? చనిపోయారా? అన్న విషయం గురించి ఏమీ చెప్పలేమని ఇరాకీ విదేశాంగ ప్రతినిధి ఫక్రీ అల్ ఇస్సా తెలిపారు. భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పిన దాని ప్రకారం ఆ 39 మంది ఇరాక్‌లోని బదూష్ జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరాకీ విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ - `వారు జీవించి ఉంటే సంతోషమే! భారతీయులు మాత్రమే కాదు చాలా మంది ఇరాకీలు కూడా తప్పిపోతున్నారు. వీరందరినీ రఖ్ఖా ప్రాంతంలో బానిసలుగా ఉంచినట్లు మా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఎంతమంది జీవించి ఉన్నారో మాత్రం తెలియదు` అన్నారు.
ప్రస్తుతం తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు భారత్ సహాయం చేయాలని ఫక్రీ అల్ కోరారు. పోరాటంలో గాయపడ్డ తమ సైనికులను, ప్రజలను కాపాడటానికి తమ వంతు కృషి చేయండని భారత్‌ను ఆయన అర్థించారు. అలాగే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడంలో సహాయం చేయాలని ఆయన కోరారు. బదూష్‌లో ఉన్న 39 మంది భారతీయులను గొడవలు సద్దుమణిగిన తర్వాత భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటూ గత ఆదివారం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పిన మాటలకు ప్రస్తుతం ఇరాకీ విదేశాంగ ప్రతినిధి మాటలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.