: టాలీవుడ్ ను వణికిస్తున్న అకున్ సబర్వాల్ గురించి కొన్ని విశేషాలు!


అకున్ సబర్వాల్, ఐపీఎస్... ప్రస్తుతం ఈ పేరు వింటేనే టాలీవుడ్ సినీ ప్రముఖులకు ముచ్చెమటలు పడుతున్నాయి. టాలీవుడ్ లో చాప కింద నీరులా విస్తరించిన డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపిన ఆయన... సినీ ప్రముఖులను రోడ్డుకు లాగారు. డగ్స్ వ్యవహారంలో పేర్లు ఉన్న వారందరినీ సిట్ కార్యాలయానికి పిలిపించుకుంటూ, వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. విచారణకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కూడా చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు డ్రగ్స్ వ్యవహారంపై పని చేసినప్పటికీ... ఇప్పుడు ఉన్నంత తీవ్రంగా వారు వ్యవహరించలేక పోయారు. కానీ, అకున్ మాత్రం సినీ పరిశ్రమలోని పెద్దలపై పంజా విసిరారు. అకున్ గురించి కొన్ని విషయాలు ఇవే...

అకున్ సబర్వాల్ ది పంజాబ్ లోని పాటియాలా. ఆయన తండ్రి ఓ ఆర్మీ ఆఫీసర్. దీంతో, చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తి అలవడింది. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన చిన్న వయసులోనే మొలకెత్తింది. వృత్తి రీత్యా ఆయన ఒక డెంటిస్ట్. అయితే, సమాజం కోసం, దేశం కోసం సేవ చేయాలనే తపనతో ఆయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశారు. 2001లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. అసోం క్యాడర్ కు ఎంపికైన అకున్... అక్కడ తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేశారు. ఉమ్మడి ఏపీకి వచ్చిన తర్వాత తొలుత అనంతపురం ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో ఫ్యాక్షనిస్టుల పని పట్టారు.

ఆ తర్వాత వరంగల్ ఓఎస్డీగా ట్రాన్స్ ఫర్ అయిన అకున్... మావోయిస్టుల నిర్మూలన కోసం పని చేశారు. అక్కడ నుంచి విశాఖపట్నం ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఆయన ఉక్కుపాదం మోపారు. విశాఖ ఎస్పీగా ఆయన హయాంలో ఏకంగా 28 సార్లు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయంటే... అకున్ దూకుడు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడ నుంచి హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా అకున్ సబర్వాల్ బదిలీ అయ్యారు. అకున్ పని తీరుపై ఎంతో విశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణలో గుడుంబా లేకుండా చేయాలనే కార్యక్రమంలో భాగంగా అకున్ కు ఎక్సైజ్ బాధ్యతలను అప్పగించారు. స్వల్ప కాలంలోనే తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన అకున్.. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకున్నారు. తాజాగా డ్రగ్స్ పై దృష్టి సారించిన ఆయన డ్రగ్స్ వినియోగదారులకు, డ్రగ్స్ ఏజెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న సినీ పెద్దలను సైతం ఆయన వదల్లేదు. స్టార్ స్టేటస్ ఉన్న సినీ పెద్దలను కూడా బజారుకు లాగారు. అకున్ దెబ్బకు సినీ పరిశ్రమ మొత్తం వణికిపోతోంది. అకున్ సబర్వాల్ భార్య ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. ప్రస్తుతం ఆమె సీఎం పేషీలో కీలక స్థానంలో పని చేస్తున్నారు.

  • Loading...

More Telugu News