: నేను కానీ.. నిర్ణయం కానీ తీసుకున్నానంటే.. నాకు నేనే సీఎంను: కమల్ ట్వీట్!
ఇటీవల వివాదాస్పదమైన కామెంట్లు చేస్తున్న తమిళ నటుడు కమలహాసన్ ట్విట్టర్‌లో కవితాత్మక ధోరణిలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను కానీ ఓ నిర్ణయం తీసుకుంటే సీఎంను తానేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వత రాజులు కాదన్న ఆయన తన నిర్ణయాన్ని అతి త్వరలో ప్రకటిస్తానన్నారు. పళనిస్వామి ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిందని కమల్ ఇటీవల వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు దుమ్మెత్తి పోశారు. ఆయనను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
దీంతో మంత్రుల తీరుపై స్పందించిన కమల్ బుధవారం కవితాత్మక ధోరణిలో ట్వీట్ చేశారు. ‘‘నేను ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రిని. ఓరి సహచరుడా నా వెంట రా. మూర్ఖుడిని అడ్డుకునేవాడే నేత’’ అంటూ ట్వీట్ చేశారు. నిరాశలో ఉన్న వారికి, ఆశతో ఉన్న తన అభిమానులకు త్వరలోనే ఓ మార్గం దొరుకుతుందని, కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండాలని కమల్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.