: వెంకయ్యనాయుడుకి పెరుగుతున్న మద్దతు.. 60 శాతానికి పైగా ఓట్లు ఆయనకే!
ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. 60 శాతానికి పైగా ఆయనకు ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ విజయం తథ్యమనే ధీమాతో ఉంది. రెండు సభల్లో కలిపి ప్రస్తుతం 788 మంది సభ్యులు ఉండగా వారిలో 485 మంది సభ్యుల మద్దతు వెంకయ్యకే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంకయ్య సునాయాసంగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. వచ్చేనెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
నిజానికి ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 790 మంది సభ్యులుండగా ఇటీవల వినోద్ ఖన్నా, అనిల్ మాధవ్ దవేలు కన్నుమూశారు. దీంతో సంఖ్యాబలం 788కి తగ్గింది. ఇక లోక్సభలో ఎన్డీఏకు 337 సభ్యులు ఉండగా, రాజ్యసభలో 77 మంది ఉన్నారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే, వైసీపీల మద్దతు కూడా ఎన్డీఏకే వుండడంతో వారి ఓట్లూ ఇటే పడనున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వెంకయ్యకు 485 ఓట్లు పడే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వెంకయ్యకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.