: రాష్ట్రపతి ఎవరో తేలేది నేడే.. 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఐదు గంటలకు తుది ఫలితం
కాబోయే భారత రాష్ట్రపతి ఎవరో నేడు తేలిపోనుంది. ప్రణబ్ తర్వాత ఆ పీఠాన్ని అధిష్ఠించేది ఎవరన్న ఉత్కంఠకు సాయంత్రం తెరపడనుంది. ఈ ఉదయం (గురువారం) 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని, ఆ తర్వాత అల్ఫాబెట్ ఆర్డర్లో మిగతా రాష్ట్రాల పెట్టెలను తెరిచి లెక్కించనున్నట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు.
మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని, సాయంత్రానికి పూర్తి ఫలితం వస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల తరపున రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 4896 మందికి ఓటుహక్కు ఉండగా సోమవారం జరిగిన పోలింగ్లో 99 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఈనెల 25 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.