: జియో నుంచి రెండు రోజుల్లో శుభవార్త.. 21న కీలక ప్రకటన.. మళ్లీ సంచలనాలు మొదలు!
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. ఈనెల 21న జరగనున్న ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ప్రత్యర్థి కంపెనీలకు కునుకు దూరం చేసే మరో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ నుంచి రానున్న రూ.500 4జీ ఫీచర్ ఫోన్‌ను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. అలాగే సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ధన్ ధనా ధన్ ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రూ.349, రూ.399తో రెండు ప్లాన్లు ప్రకటించిన జియో 21న జరగనున్న సమావేశంలో రూ.80-రూ.90 మధ్యలో ఉండే మరో ప్లాన్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్లాన్ పాత వినియోగదారులకా? లేక కొత్తగా రాబోతున్న 4జీ ఫీచర్ ఫోన్‌కా? అన్న విషయంలో స్పష్టత లేదు. వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను కూడా ఆవిష్కరించనుంది. ఇప్పటికే పలు నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఈ కనెక్షన్‌తో 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలలపాటు ఫ్రీగా అందించనున్నారు. అయితే ఈ సేవలు పొందాలంటే తొలుత రూ.4500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది.