: ఐఫా 2017 నామినేషన్లలో `దంగల్` లేకపోవడానికి కారణం ఇదే!
2016లో విడుదలైన సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) వారు అవార్డులు అందజేశారు. కానీ వారి నామినేషన్లలో రికార్డుల వర్షం కురిపించిన `దంగల్` సినిమా మాత్రం లేదు. ఇందుకు కారణాలను ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. అవార్డులకు తమ సినిమాలను నామినేట్ చేయడానికి దరఖాస్తు పత్రాలను అన్ని నిర్మాణ సంస్థలకు ఐఫా వారు పంపిస్తారు. ఆయా సంస్థలు తమ సినిమాలు, కేటగిరీల వివరాలు పూర్తి చేసి పంపిన తర్వాత నామినేషన్ ఓటింగ్ ప్రక్రియ మొదలుపెడ్తారు.
ఇందులో భాగంగా `దంగల్` సినిమా నిర్మాతలు తమకు సినిమా వివరాలను తిప్పి పంపలేదని, అందుకే నామినేషన్లలో `దంగల్` లాంటి మంచి చిత్రాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఐఫా ప్రతినిధి ఆండ్రే టిమ్మిన్స్ తెలిపారు. ఒకవేళ `దంగల్` సినిమా నామినేషన్లలో ఉండి ఉంటే ఉత్తమ చిత్రం అవార్డు గెల్చుకునేదని ఆయన చెప్పారు. `దంగల్`తో పాటు గతేడాది విడుదలైన `ఎయిర్ లిఫ్ట్`, `రుస్తుం` సినిమాలు కూడా ఐఫా నామినేషన్లలో కనిపించలేదు. `ఎయిర్‌లిఫ్ట్` సినిమాలో నటనకి అక్షయ్ కుమార్‌కు జాతీయ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో దీనిపై సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహలనీ స్పందిస్తూ - `ఐఫా ఒక అంతర్జాతీయ వేడుక. వారు పారదర్శకత చూపిస్తారు. వాళ్ల హాలీడే ప్లాన్ లాంటి వేడుకకు ఆమిర్ ఖాన్, అక్షయ్‌లు హాజరు కారని తెలిసి వాళ్లను నామినేట్ చేయలేదు` అన్నారు.