: నిశ్శబ్దంగా యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా... భారీ ఎత్తున ఆయుధాలు తరలింపు
టిబెట్ లోని పర్వత ప్రాంతాలకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న చైనా రక్షణ శాఖ నిశ్శబ్దంగా యుద్ధానికి సిద్ధమవుతోందని చైనా మిటలరీ అధికార పత్రిక 'పీఎల్ఏ డెయిలీ' సంచలన కథనాన్ని నేడు ప్రచురించింది. సిక్కింలోని డోక్లాం సమీపంలో సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఇటీవల 11 గంటల పాటు లైవ్ ఫైర్ ఎక్సర్ సైజులను విజయవంతంగా పూర్తి చేసిన చైనా, ఇప్పుడు మరిన్ని ట్యాంకర్లు, ఆయుధాలను మోహరిస్తోందని తెలిపింది.
ఉత్తర టిబెట్ లోని కున్ లుమ్ పర్వత ప్రాంతాల్లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్, యుద్ధం చేసేందుకు పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపింది. సిక్కిం సరిహద్దుల్లోని నాథూలా పాస్ కు ఆవలివైపున ఉన్న చైనా భూభాగంలోకి కూడా సైనిక దళాలు పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గత నెలలో డోక్లాం సమీపంలో రహదారి నిర్మాణాన్ని చైనా తలపెట్టిన తరువాత ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.