: అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు: నటుడు బెనర్జీ
చిరంజీవి బయోపిక్ ను తెరకెక్కిస్తే అదో అద్భుతమైన చిత్రం అవుతుందని నటుడు బెనర్జీ అన్నాడు. ఓ సాధారణ వ్యక్తిగా పరిశ్రమలోకి వచ్చిన చిరంజీవి, ఓ మెగాస్టార్ అయ్యేంత వరకు ఆయన ప్రస్థానం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పాడు. చిరంజీవి గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయని తెలిపాడు. చిరంజీవే స్వయంగా ఓ స్క్రిప్ట్ రైటర్ ను పెట్టుకుని, ఆయన కథను రాయించుకుని సినిమా తీస్తేనే అది గొప్ప చిత్రం అవుతుందని చెప్పాడు.
చిరంజీవి సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు తెలుసని బెనర్జీ తెలిపాడు. చిరంజీవి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం తనకు వస్తే, అందుకు తాను సిద్ధమని చెప్పాడు. అయితే ఆయన తనకు అవకాశం ఇస్తారా? లేదా? అనేదే పాయింట్ అని అన్నారు. చిరంజీవిని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే దర్శకులు పరిశ్రమలో చాలా మంది ఉన్నారని చెప్పాడు.
ఏదైనా సాధించాలనే తపన చిరంజీవిలో చాలా ఎక్కువని... ఎంతో కష్టపడే మనస్తత్వం అయనదని బెనర్జీ తెలిపారు. ఈ కారణంగానే ఆయన ఓ సామాన్యుడి స్థాయి నుంచి మెగాస్టార్ అయ్యారని చెప్పాడు. 150వ సినిమాను కూడా తొలి చిత్రం అనే భావనతోనే చిరంజీవి చేశారని తెలిపాడు.