: మహిళల వరల్డ్ కప్: ఫైనల్ కు ఇంగ్లండ్... ఇక తేల్చుకోవాల్సింది ఇండియా, ఆస్ట్రేలియా!
మహిళల వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, దక్షిణాఫ్రికా జట్టుపై ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగుల స్కోరుకే పరిమితమైంది. 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు మధ్యలో తడబడగా, విల్సన్, గున్ లు చివర్లో ధాటిగా ఆడి ఇంగ్లండ్ ను గట్టెక్కించారు.
ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో, మూడు బంతుల్లో 2 పరుగులు కావాల్సిన స్థితిలో షబ్ని ఫోర్ కొట్టడంతో ఇంగ్లండ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు వరల్డ్ కప్ తుది పోరుకు ఎంపిక కావడం ఇది ఏడోసారి. ఇక నేడు జరిగే రెండో సెమీఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో ఫైనల్ ఆడుతుంది.