: తల్లిదండ్రులంటే పూర్ణిమకు ఎందుకంత అయిష్టం?.. బలమైన కారణమే ఉండచ్చంటున్న పోలీసులు!


పూర్ణిమ సాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ పేరో సంచలనం. సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా ముంబై వెళ్లిపోయిన పూర్ణిమ 40 రోజుల తర్వాత ముంబైలో దొరికింది. కుమార్తె ఆచూకీ లభ్యం కావడంతో చూసేందుకు ఆశగా వెళ్లిన ఆమె తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. వాళ్లను తాను చూసేదే లేదంటూ పూర్ణిమ తెగేసి చెప్పింది. దీంతో ఆశగా వెళ్లిన తల్లిదండ్రులు నిరాశగా తిరిగొచ్చారు. ఇక మంగళవారం హైదరాబాద్ చేరుకున్న పూర్ణిమ ఇంటికొస్తుందని తల్లిదండ్రులు భావించారు. ఈసారీ వారికి నిరాశే ఎదురైంది. వారి పొడ గిట్టనట్టే బాలిక ప్రవర్తిస్తోంది. ఇంటికి వెళ్లేది లేదంటూ ఆమె తెగేసి చెప్పడంతో పోలీసులు ఆమెను నేరుగా బాలికా సదన్‌కు పంపించారు.

తల్లిదండ్రులను కలిసేందుకు పూర్ణిమ ఎందుకు ఇష్టపడడం లేదన్న విషయం ఇప్పుడు పోలీసు అధికారుల్లో విస్తృత చర్చకు దారితీసింది. తాను కలిస్తే వారికి అరిష్టమని బాలిక చెబుతున్నా.. అంతకుమించి బలమైన కారణం ఏదో ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇంట్లో ఉండగా ముంబైకి చెందిన బుల్లితెర నటితో చేసిన చాటింగ్‌లను ముంబై వెళ్లేముందు పూర్ణిమ డిలీట్ చేయడం ఆమె తెలివికి నిదర్శనమని చెబుతున్నారు. అంతటి తెలివైన అమ్మాయి కుటుంబాన్ని అసహ్యించుకుంటుండడం వెనక బయటకు తెలియని బలమైన కారణం ఏదో ఉంటుందని భావిస్తున్న పోలీసులు అదేంటో తెలుసుకునే పనిలో పడ్డారు.  

కాగా, హైదరాబాద్ చేరుకున్న పూర్ణిమను నేడు (బుధవారం) రంగారెడ్డి జిల్లా బాలికా సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు పరచనున్నారు. బాలికతో కమిటీ సభ్యులు మాట్లాడిన అనంతరం పూర్ణిమ భవితవ్యం విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పూర్ణిమ కనుక ఇంటికి వెళ్లేందుకు నిరాకరిస్తే ఆమెను సదనంలోనే ఉంచి, అందుకు గల కారణాలపై ఆరా తీయాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News