: రేపటి నుంచి బెల్టుషాపుల బంద్... ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ఆ వివరాలు .. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేతకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. రహదారిపై మద్యం సేవిస్తూ కనిపించినా అరెస్టులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది.
ఉద్ధానంతో పాటు ఏపీలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేదలకు నెలకు రూ.2500 ప్రత్యేకంగా పింఛన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్... అక్రమ రవాణాకు పాల్పడ్డ వారందరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ గృహ నిర్మాణశాఖకు రూ.500 కోట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని అధ్యయనం చేస్తోన్న మంజునాథ కమిషన్ సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని కేబినెట్ ఆదేశించింది.