: ‘పాక్’లో భారత టీవీ సీరియల్స్ పై నిషేధం ఎత్తివేత... లాహోర్ హైకోర్టు ఆదేశం!
పాకిస్థాన్ లో భారత టీవీ సీరియల్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు లాహోర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత టీవీ సీరియల్స్ లోని అంశాలు పాక్ కు వ్యతిరేకంగానో, అభ్యంతరకరంగానో ఉంటే సెన్సార్ చేయాలి కానీ, పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని లాహోర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్సూర్ అలీ షా తన తీర్పులో పేర్కొన్నారు. భారత టీవీ సీరియల్స్ పై పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరి అథారిటీ (పెమ్రా) విధించిన నిషేధం చెల్లదని పేర్కొన్నారు.
ఈ ప్రసారాలపై ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని, నిషేధించడానికి సరైన కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తి మన్సూర్ అలీ షా అభిప్రాయపడ్డారు. భారతీయ చలన చిత్రాల ప్రదర్శనకు అనుమతిస్తూ, టెలివిజన్ ప్రసారాలను నిలిపివేయడాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ ప్రశ్నించారు. కాగా, యూరీ ఉగ్రదాడి అనంతరం, పాక్-భారత్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతినడంతో గత అక్టోబర్ లో భారతదేశానికి సంబంధించిన అన్ని టీవీ ప్రసారాలపైన పెమ్రా నిషేధం విధించింది.